కేసీఆర్ సర్కార్ కు ప్రతిష్టాత్మకం, బీజేపీకి కీలక సమయం.. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక విషయంలో రెండు పార్టీలు ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నాయి. అయితే అదే ప్రాంతం నుంచి టీఆరెస్ తరపున గెలిచి, పార్టీ నుంచి బహిష్కరించబడి, బీజేపీలో చేరి ఇప్పుడు టీఆరెస్ కె పోటీగా బరిలోకి దిగుతున్నారు ఈటల రాజేందర్. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆరెస్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు సామెతను నిజం చేయాలని తెగ మల్లగుల్లాలు పడుతోంది. అటు ఈటల రాజేందర్ ను ఓడించడమే కాక బీజేపీని కూడా చావు దెబ్బ కొట్టాలని పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతే కాకుండా సెప్టెంబర్‌లో హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు వస్తున్న వార్తలు మరింత హీట్ పెంచుతున్నాయి. దీనిపై పార్టీలకు కూడా సంకేతాలు అందినట్లు సమాచారం. కరోనా ఉధృతి నేపథ్యంలో సెప్టెంబర్‌లోగా 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారుల టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఎన్నికల సిబ్బందికి ముందే వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఓటర్లు, నేతలకు కూడా విస్తృతంగా వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళిక రూపొందుతోంది.
గత సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేశారు. ఈటల రాజేందర్ రాజీనామాను స్పీకర్ కూడా ఆమోదించారు. దీంతో హుజురాబాద్‌లో ఎన్నికలు అనివార్యం కావడంతో ఇప్పటి నుంచే ఎన్నికల సందడి నెలకొంది. ఈ మేరకు అన్ని పార్టీలు ఇప్పటి నుంచే దృష్టి సారించాయి. ఇక ఈటల రాజేందర్ నియోజవర్గాన్ని చుట్టేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతూ బీజేపీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.
నియోజకవర్గంలో ఆధిపత్యం చాటేకుందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటికే మంత్రులు గంగుల కమలాకర్‌తో పాటు టీఆర్ఎస్ నేతలు అందరూ హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేసేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించి బలం నిరూపించుకోవాలని చూస్తోంది. దీంతో ఈ నియోజకవర్గ ఎన్నికలు దుబ్బాకను మించిన హీట్ ను రాష్ట్రంలో సృష్టిస్తున్నాయి.