ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మద్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించి టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ విజయంలో శిఖర్ ధవన్(92: 49 బంతుల్లో.. 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. అయితే శిఖర్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మ్యాచ్ మొదటి నుంచి ధాటిగా ఆడుతున్న ధవన్.. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే సెంచరీకి 8 పరుగుల దూరంలో రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వికెట్లను వదిలిపెట్టి స్వీప్ షాట్ ఆడే క్రమంలో యార్కర్ బంతిని మిస్ అయ్యడు. దీంతో బంతి నేరుగా వికెట్లను తాకింది. దీంతో శిఖర్ పెవిలియన్ బాట పట్టాడు. శిఖర్ అవుటయ్యే సమయానికి ఢిల్లీ గెలుపునకు ఇంకా 5.1 ఓవర్లలో 44 పరుగులు కావాల్సి ఉంది. అయితే ఆ తర్వాత స్టోయినిస్, పంత్ లాంఛనం పూర్తి చేశారు. దీంతో మరో పది బంతులు మిగిలుండగానే.. కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో జ్యే రిచర్డ్‌సన్ 2 వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్, రైలీ మెరిడిత్‌లు చెరో వికెట్ తీశారు. కాగా.. మహ్మద్ షమి తన 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 13.25 ఎకానమీతో 53 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా.. ఈ విజయంతో ఢిల్లీ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ 2కు చేరింది.
కాగా.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు అదిరిపోయే ఓపెనింగ్ అభించింది. 10.1 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 100 పరుగులు చేసి అదరగొట్టారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(69: 36 బంతుల్లో.. 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), కేఎల్ రాహుల్(61 నాటౌట్: 51 బంతుల్లో.. 7 ఫోర్లు, 2 సిక్స్), అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చారు. 13 ఓవర్ల వరకు వికెట్ పడకుండా బౌండరీల మోత మోగించారు. అయితే వీరిద్దరూ అవుటైన తరువాత పంజాబ్ స్కోరు బోర్డు నెమ్మదించింది. దీనికి తోడు చివర్లో ఢిల్లీ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో 200 మార్కును తృటిలో మిస్ చేసుకున్నారు. కానీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 195 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ ఛేజ్ చేసేయడంతో పాయింట్ల పట్టికలో వరుసగా రెండో ఓటమి నమోదు చేసి ఏడో స్థానానికి పంజాబ్ పడిపోయింది.