ఇంగ్లండ్‌తో జరిగిన 5వ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ మొదటి నుంచి పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు ఏకంగా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ కూడా భారత్ వశమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డిండ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రాహుల్ గైర్హాజరీలో కెప్టెన్ కోహ్లీ రోహిత్‌తో కలిసి బ్యాటింగ్‌కు దిగాడు. మొదటి నుంచి బౌలర్లపై ఎదురు దాడికి దిగిన వీరిద్దరూ 5.2 ఓవర్లలోనే 50 పరుగులు చేశారు. అయితే 9వ ఓవర్లో స్టోక్స్ బౌలింగ్‌లో రోహిత్(64: 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు).. వికెట్లపైకి ఆడుకున్నాడు. దీంతో టీమిండియా 94 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
కానీ వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్(32: 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే రషీద్ ఖాన్ వేసిన 14వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద రాయ్‌కు క్యాచ్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా(39: 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) కూడా ఈ సారి బ్యాట్ ఝుళిపించాడు. చివరి వరకు క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ కోహ్లీ(80 నాటౌట్: 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు) ఆఖరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 2 వికెట్లకు 224 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లీష్ బౌలర్లలో రషీద్ ఖాన్, బెన్ స్టోక్స్‌లకు చెరో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు తొలి ఓవర్లోనే భారీ దెబ్బ తగిలింది. పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఓపెనర్ జేసన్ రాయ్(0)ను బౌల్డ్ అయ్యాడు. అయితే జోస్ బట్లర్(52: 34 2 ఫోర్లు, 4 సిక్సులు), డేవిడ్ మలాన్(68: 46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు) వికెట్ పడకుండా ఆడుతూ.. బౌండరీలతో చెలరేగారు. దీంతో 13 ఓవర్ల వరకు ఒక్క వికెట్‌తోనే ఇంగ్లండ్ దాదాపు 140 పరుగులు చేసింది. అయితే అదే ఓవర్లో మళ్లీ భువీనే బట్లర్ వికెట్ తీసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత 15వ ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ ఒకే ఓవర్లో జానీ బెయిర్ స్టో(7), డేవిడ్ మలాన్ వికెట్లను పెవిలియన్ చేర్చి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
ఆ తర్వాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(1), బెన్ స్టోక్స్(14), జోఫ్రా ఆర్చర్(1), క్రిస్ జోర్డన్(11) వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయారు. చివర్లో శామ్ కర్రాన్(14) రెండు సిక్సులు బాదినా అప్పటికే మ్యాచ్ ఇంగ్లండ్ చేయి జారిపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 188 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో టీమిండియా 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది. అత్యంత పొదుపుగా బౌలింగ్ వేసి 4 ఓవర్లలో 2 వికెట్లు తీయడమే కాకుండా 15 పరుగులు మాత్రమే ఇచ్చిన భువీకి మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.