టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ మహత్తర కార్యంలో భాగమయ్యాడు. ఖడ్గమృగాల సంరక్షణ కోసం నడుం బిగించాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఐపీఎల్ 2021లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో దానికి సంబంధించిన షూస్ ధరించి మైదానంలోకి దిగాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో పడిన ఒంటికొమ్ము ఖడ్గమృగాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అంతరించిపోతున్న ఆ ఖడ్గమృగాలను కాపాడేందుకు రోహిత్ ఈ ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ‘రైనోలను రక్షిద్దాం’ అని రాసి ఉన్న ప్రత్యేక షూస్ ధరించి మైదానంలోకి దిగాడు. దీనిపై రోహిత్.. ఓ ఎమోషనల్ పోస్ట్‌ను కూడా ట్విటర్ వేదికగా షేర్ చేశాడు.
‘శుక్రవారంనాటి మ్యాచ్ ఎంతో ప్రత్యేకమైనది. ఓ మహత్తర కార్యక్రమంలో నేను భాగం కావడం సంతోషంగా ఉంది’ అని రోహిత్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. రోహిత్ చేసిన ఈ పనిని అభిమానులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ‘చాలా గొప్ప పని చేశావ్.. రోహిత్’ అంటూ అభినందిస్తున్నారు. మరికొందరైతే ఇతర క్రికెటర్లు కూడా రోహిత్‌ను చూసి నేర్చుకోవాలని, డబ్బుల కోసం కాకుండా.. సమాజ హితం కోసం అతడు ఇలా చేయడం నిజంగా మెచ్చుకోదగిన విషయమని కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఐపీఎల్ 2021లో భాగంగా బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఓటమి చవి చూసింది. చివరి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఆర్సీబీ విజయం సాధించింది. లో స్కోరింగ్ గేమ్ అయినప్పటికీ ఇరు జట్ల బౌలర్లూ అద్భుతంగా రాణించడంతో బ్యాట్స్‌మన్ పరుగులు సాధించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు.. ఏబీ డివిలియర్స్(48: 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సులు), గ్లెన్ మ్యాక్స్‌వెల్(39: 28 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సులు), విరాట్ కోహ్లీ(33: 29 బంతుల్లో, 4 ఫోర్లు) పోరాటంతో చివరి బంతికి విజయం సాధిచింది.