ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడింది. దీంతో వరుసగా రెండో ఓటమిని నమోదు చేసింది. ఓటమి మాత్రమే కాదు ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు అనేక రకాల చెత్త రికార్డులను కూడా నమోదు చేసింది. ఈ సీజన్లో పవర్ ప్లేలో అతి తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై బ్యాట్స్‌మెన్ అంతా పరుగులు చేయడానికి నానా అవస్థలు పడ్డారు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి.. అంటే 6 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు మాత్రమే చేసింది. ఇక మిగతా మ్యాచ్‌లో కూడా ముంబై ఏ మాత్రం కోలుకోలేదు. కనీస పోరాటం కూడా చూపలేదు. దారుణ ప్రదర్శనతో ఓటమి చవి చూసింది.
అంతేకాదు ఈ మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో అంటే.. 16వ ఓవర్ నుంచి 20వ ఓవర్ మధ్య అతి తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా ముంబై నిలిచింది. అది మాత్రమే కాకుండా డెత్ ఓవర్లలో అత్యధిక వికెట్లు పోగొట్టుకున్న జట్టుగా కూడా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో డెత్ ఓవర్లలో ఏకంగా 22 వికెట్లను ముంబై పోగొట్టుకుంది. ఈ ఏడాది మాత్రమే కాదు.. గతేడాది కూడా ముంబై ఇదే తరహా ప్రదర్శన చేసింది. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లోనూ ముంబై 16 మ్యాచ్‌ల్లో డెత్ ఓవర్లలో 23 వికెట్లు పోగొట్టుకుని చెత్త రికార్డును నమోదు చేసింది.
ఇదిలా ఉంటే ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చక్కటి విజయం సాధించింది. మొదట బౌలర్లు రాణించి ముంబై జట్టును అతి తక్కువ పరుగులకే కట్టడి చేయగా.. ఆ తర్వాత బ్యాట్స్మయన్ సునాయాసంగా టార్గెట్ ఛేజ్ చేశారు. ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేయగా.. అందులో రోహిత్ శర్మ ఒక్కడే 63 పరుగులకు చేసి అర్థసెంచరీతో రాణించాడు. ఆ తర్వాత సూర్యకుమార్ 33 మాత్రమే పర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో బిష్ణోయి 2, షమీ 2, అర్ష్‌దీప్,దీపక్ హూడా తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం లభించింది. 25 పరుగులు చేసిన తర్వాత మయాంక్ అగర్వాల్ అవుటైనా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 60 నాటౌట్ అర్థ సెంచరీతో మెరిశాడు. అతడికి క్రిస్ గేల్ 43 పరుగులు సహకరించాడు. దీంతో పంజాబ్ జట్టు ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది.