ఈ ఐపీఎల్ సీజన్లో దారుణ ప్రదర్శన చేస్తూ ఏ మాత్రం స్థాయికి తగినట్లు ఆడలేకపోతున్న జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఒకటి. జట్టు నిండా స్టార్ ప్లేయర్లున్నా.. కనీస పోరాటం చూపలేక ప్రతి మ్యాచ్‌లోనూ చతికిలబడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా కేకేఆర్ అదే తీరు రిపీట్ చేసింది. ఈ సీజన్లో కేకేఆర్‌కు ఇది 5వ ఓటమి. ఈ క్రమంలోనే దిగ్గజ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కేకేఆర్ జట్టుపై అసహనం వ్యక్తం చేశాడు. ఆ జట్టు తమలోని లోపాలను ఏ మాత్రం ఆలోచించడం లేదంటూ మండిపడ్డాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లిటిల్ మాస్టర్.. కేకేఆర్ జట్టులోని లోపాలను వివరించాడు. ‘మిడిల్ ఆర్డర్‌లో కేకేఆర్ ఘోరంగా విఫలం కావడంతోనే భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతుంది. అహ్మదాబాద్‌లో పిచ్ మంచి బ్యాటింగ్ ట్రాక్. మరి కేకేఆర్ బ్యాటింగ్ చేయడానికి ఎందుకు అంత చెమటోడ్చిందో అర్థం కాలేదు. నిజాయితీగా చెప్పాలంటే ఆ జట్టులో ఎక్కువమంది క్లాస్ బ్యాట్స్‌మెన్ లేరు. గిల్‌ను తప్పిస్తే.. మరొక్కరు కూడా క్లాస్ బ్యాట్స్‌మన్ కనిపించరు. నితీశ్ రాణా, మోర్గాన్, నరైన్ వీరిలో ఎవరూ క్లాస్ బ్యాట్స్‌మన్ కాదు. ఇక హిట్టర్ రసెల్ 5, 6 స్థానాల్లో వస్తున్నాడు. జట్టులో సీనియర్ ఆటగాడు, కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను ప్రమోట్ చేయడం లేదు. డగౌట్‌లో కూర్చుని చూస్తున్నారే కానీ, బ్యాటింగ్‌కు మాత్రం చాలా మంది రావడం లేదు’ అని గవాస్కర్ అన్నాడు.
అంతేకాకుండా ఆ జట్టులోకి తాజాగా వచ్చిన స్పిన్నర్ సునీల్ నరైన్ విషయంలో కూడా గవాస్కర్ తప్పుబట్టాడు. నరైన్ కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్లో 4 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడని, అది ఏ మాత్రం జట్టుకు ఉపయోగపడదని, అది నిజానికి టైం వేస్ట్ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కేకేఆర్ తుది జట్టులో నరైన్ ఉన్నప్పుడు ఆర్డర్‌లో ముందుగా దింపడమే మంచింది. అప్పుడు కనీసం కొన్ని షాట్లైన కనెక్ట్ అవుతాయి’ అని తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నరైన్ ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. శుబ్‌మన్ గిల్(43), రసెల్(45 నాటౌట్) ధాటిగా ఆడండంతో 154 పరుగులు చేయగా.. మిగతా బ్యాట్స్‌మన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ స్కోరును ఆడుతూ పాడుతూ ఛేదించింది. దీంతో కేకేఆర్‌కు మరో ఓటమి తప్పలేదు.