దేశంలో కరోనా సెకడ్ వేవ్ విజృంభిస్తోంది. లక్షల కేసులు ప్రతి రోజూ నమోదవుతున్నాయి. వేల మంది మరణిస్తున్నారు. చికిత్స కోసం ఇప్పటికే ఆసుపత్రుల ముందు పడిగాపులు కాస్తున్న బాధితుల సంఖ్య కూడా నానాటికీ పెరుగూనే ఉంది. అలాగే చికిత్స అందక కూడా అనేక మంది వైరస్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మిగిలిన వారు కూడా ఆక్సిజన్ కొరత, బెడ్స్ కొరతతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదే సమయంలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న వైద్య నిపుణుల హెచ్చరికలు ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
సాధారణంగానే కరోనా మొదలైనప్పటి నుంచి అనేకమంది నేతలు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కొందరు గో మూత్రం తాగితే కరోనా పోతుందని, మరికొందరు ఆవు పేడతో కరోనాను దూరం చేయవచ్చని తెగ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి మధ్యప్రదేశ్‌కు చెందిన సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ కూడా చేరారు. ఆమె తాజాగా చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కరోనాను జయించాలన్నా, థర్డ్ వేవ్ అపాయం నుంచి తప్పించుకోవాలన్నా.. యజ్ఞం నిర్వహించాలని, దాని ద్వారా పర్యావరణం శుద్ధి చేస్తే థర్డ్‌వేవ్ అపాయం నుంచి తప్పించుకోవచ్చని ఆమె చెప్పుకొచ్చారు.
మంత్రి ఉషా ఠాకూర్ సాధారణంగా కరోనాపై షాకింగ్ కామెంట్లు చేయడం, మాస్కు పెట్టుకోకుండా తిరగడం వంటి పనులు చేస్తుంటారు. ఇక తాజాగా ఇండోర్‌లో ఓ కొవిడ్ కేర్ కేంద్రం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఉషా ఠాకూర్ మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ‘‘పూర్వకాలంలో మహమ్మారులను అంతం చేయడానికి యజ్ఞాలు నిర్వహించేవారు. ప్రస్తుత మహమ్మారినీ దానితోనే అంతం చేయగలం. అందుకోసం పర్యావరణాన్ని శుభ్రం చేయాలి. అందుకు మీ సహకారం కావాలి. ఇది ఆచారమో, మూర్ఖత్వమో కాదు. యజ్ఞం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేయగలిగితే కరోనా థర్డ్ వేవ్ భారత్ దరి చేరదు’’ అంటూ సదరు మంత్రి అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై ఎలాంటి వివాదం రేగుతుందో చూడాలి.