దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ లక్షల కేసులు నమోదవుతున్నాయి. వేల మంది మరణిస్తున్నారు. ఒకపక్క ఈ ఫంగస్ దాడి జరుగుతుండగానే మరో పక్క బ్లాక్ ఫంగస్ మహమ్మారి కూడా దాడి మొదలు పెట్టింది. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది ప్రజల పరిస్థితి. కరోనా చికిత్సకే ఆక్సిజన్ అందక, బెడ్లు లభించక అల్లాడుతుంటే పులి మీద పుట్రలా ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కూడా సోకుతుండడంతో ప్రజలు భీతావహులవుతున్నారు. ప్రాణాల కోసం పోరాడి కరోనా నుంచి కోలుకున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ దాడితో మళ్లీ ప్రాణాపాయంలోకి వెళ్లిపోతున్నారు. ఈ ఫంగి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అయితే శస్త్ర చికిత్స చేసినా అవసరమైన ఔషధాలు లభించక ప్రాణాలు కోల్పోతున్న వారూ లేకపోలేదు.
కాగా.. తాజా అధ్యయనాలతో ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసే విషయాలు బయటపడ్డాయి. అదేంటంటే.. కరోనా మహమ్మారితో పాటు బ్లాక్ ఫంగస్ కూడా ఒకేసారి దాడి చేసే అవకాశాలున్నాయని, దీనివల్ల రెండింటితో ఒకేసారి బాధితుడు పోరాడాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న తరువాతే బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కరోనా బారిన పడినప్పుడే బ్లాక్ ఫంగస్ కూడా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐసీయూలో ఉన్నవారు, డయాబెటిస్, హెచ్‌ఐవీలతో బాధపడుతున్న వారు ఈ ఫంగస్ బారినపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనాతో పోరాడుతున్న సమయంలోనే తలనొప్పి, ముక్కులో ఏదో అడ్డం పడినట్లు ఉండడం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలున్నప్పుడు బ్లాక్ ఫంగస్ టెస్టులు కూడా చేయించుకోవడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.