మీరెప్పుడైనా మట్టి కొన్నారా..? కుండలు చేసేవాళ్లు, ఇళ్లు కట్టేవాళ్లు మట్టిని కొంటుంటారు. కొంతమందైతే నదీ పరివాహక ప్రాంతాల నుంచి మట్టిని ఫ్రీగా తెచ్చుకుని పని కానిస్తుంటారు. అయితే ఓ కేజీ మట్టి ఖరీదు లక్షల కోట్లు ఖర్చు చేయడం మీరెప్పుడైనా విన్నారా..? కానీ ఇది నిజం. అయితే ఇది భూమ్మీది మట్టి కాదు లెండి. మార్స్(అంగారకుడి) నుంచి తీసుకురాబోయే మట్టి. ప్రస్తుతం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా దీనికోసం తెగ కష్టపడుతోంది. అనేక ప్రణాళికలు వేసి మరీ ఎలాగైనా మార్స్ మట్టిని మన భూమి పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.
దాదాపు రెండు పౌండ్(దాదాపు కేజీ)ల మట్టిని మార్స్ నుంచి తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం నాసా 9 బిలియన్ల డాలర్లు(అక్షరాలా రూ.6 లక్షల కోట్లు) ఖర్చు చేయబోతోంది. ఒకవేళ నాసా కల ఫలించి అంగారక గ్రహం మీది మట్టి భూమికి చేరితే అది చరిత్రాత్మక విషయమనే చెప్పాలి. అంతేకాదు పెట్టిన ఖర్చుకు అసలైన లాభం చేకూరడమే కాక.. భూమ్మీద అత్యంత విలువైన వస్తువు కూడా అదే అవుతుంది.
మొత్తం 3 దశలో ఈ ప్రాజెక్టు ఉండబోతుంది. అయితే ఈ శాంపిల్ సేకరణ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి రెండేళ్లు పట్టే అవకాశం ఉందని నాసా చెబుతోంది. ఇక ఆ మట్టిని భూమ్మీదకు తేవడానికి మరో పదేళ్లకాలం పైనే పట్టొచ్చని అంచనా. అయినప్పటికీ అత్యంత విలువైందిగా భావిస్తున్న అక్కడి మట్టిని భూమి పైకి తీసుకొచ్చేందుకు నాసా తాజాగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే అంగారకుడి మట్టి కోసం ఇంత ఖర్చు చేయడం అవసరమా..? అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి వీటిన నాసా పట్టించుకునేలా కనిపించడం లేదు.