ఇటీవల తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఈటల రజేందర్ మధ్య నెలకొన్న వివాదం రాష్ట్రాన్నే షేక్ చేసింది. ఈటల రాజేందర్ భూ కబ్జాకు పాల్పడ్డారని, ఆయన పేదలను మోసం చేసి అసైన్డ్ భూములను అక్రమంగా సొంతం చేసుకున్నారని ఆరోపించిన టీఆర్ఎస్ ఆధిష్టానం ఆయనపై కేసులు నమోదు దర్యాప్తులు జరిపింది. అంతేకాకుండా ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డారని తేలండంతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. దీంతో ఈటల కేసీఆర్‌పై, టీఆర్ఎస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. దీంతో ప్రస్తుతం ఈటల వర్సెస్ కేసీఆర్‌లా పరిస్థితి తయారైంది. అయితే ఇంత జరుగుతున్నా కేసీఆర్ మాత్రం ఈటల గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. కానీ తాజాగా కరోనా నేపథ్యంలో నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్‌లో కేసీఆర్ తొలిసారిగా ఈటల విషయంలో నోరు విప్పారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ తాజాగా వరుస కేబినెట్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా క్యాబినెట్ మీటింగ్‌లో లాక్డౌన్ మార్గదర్శకాలు విడుదల చేసిన తరువాత ఈటల విషయంలో కేసీఆర్ మాట్లాడారు.మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ అనంతరం అధికారులు బయటికి వెళ్లిన తర్వాత.. ఈటల రాజేందర్ విషయంపై ఇతర మత్రుల వద్ద సీఎం కేసీఆర్ క్లుప్తంగా ప్రస్తావించారు. ఈటల రాజేందర్ తప్పు చేశారని, దానిని ఆయన స్వయంగా ఒప్పుకొన్నారని, అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఒకవేళ ఆయనపై చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేదని, అందుకే తప్పలేదని అన్నారు. చట్ట ప్రకారమే అంతా జరుగుతుందని, ఈ వ్యవహారంపై ఎవరూ మాట్లాడవద్దని, ఎవరిపని వారు చేసుకోవాలని మంత్రులకు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే క్యాబినెట్ మీటింగ్‌లో కరోనా పరిస్థితులపై కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడడం చాలా ముఖ్యమని అన్నారు. ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు. కరోనా పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై కూడా కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.