అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్టంరాజును సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎంపీని, అది కూడా పుట్టిన రోజునాడే అరెస్టు చేస్తారా..? అంటూ మండిపడ్డారు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం జగన్ రెడ్డి తుంగలో తొక్కారని, దేశంలోనే ఇలాంటి మూర్ఖత్వపు నియంత పాలన ఎక్కడా లేదని మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లతో సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ట్వీట్లలో.. ‘నియంత కంటే ఘోరంగా ప్రజల ప్రాణాల రక్షణ పట్టించుకోకుండా, తన కక్ష తీర్చుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని జగన్ వాడుతున్నారు. దేశంలోనే ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా వ్యాఖ్యలు చేశారని ఎంపీ రఘురామకృష్ణంరాజు గారిని అరెస్ట్ చేస్తే, జగన్ రెడ్డి సర్కారుపై విశ్వాసం లేదని 5 కోట్ల ఆంధ్రులూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వారందరినీ అరెస్ట్ చేస్తారా?’ అని ప్రశ్నించారు.
అలాగే ‘ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు చేయొద్దని సుప్రీం కోర్టు ఆదేశించినా లెక్క చేయకుండా.. ‘వై’ కేటగిరి భద్రతలో వుంటూ ఇటీవలే బైపాస్ సర్జరీ చేసుకున్న సొంత పార్టీ ఎంపీని.. ఆయన పుట్టినరోజు నాడే అరెస్ట్ చేయించడం జగన్‌రెడ్డి సైకో మనస్తత్వానికి నిదర్శనం’ అని మండిపడ్డారు.
అంతేకాకుండా ‘ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(CID) కాస్తా సీఎం ఇండివిడ్యువల్ డిపార్ట్‌మెంట్‌గా మారిపోయింది. ప్రశ్నిస్తే సీఐడి అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు, వైసీపీలో చేరకపోతే జేసీబీతో ధ్వంసం,లొంగకపోతే పీసీబీ తనిఖీలు. ఇదీ నియంత సైకో జగన్‌రెడ్డి పాలన. జగన్ రెడ్డి అసమర్థతను ఎత్తిచూపి,ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నానం’టూ లోకేష్ తన ట్వీట్లలో రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు.