రెండు, మూడు రోజుల నుంచి ధోనీ ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అయ్యాడు. అతడి నయా లుక్ చూసిన క్రికెట్ అభిమానులంతా షాకయ్యారు. ఇదేంటి ధోనీ ఇలా మారిపోయాడంటూ షాకయ్యారు. అంతేకాకుండా దాని వెనకున్న రహస్యాన్ని ఛేదించేందుకు కూడా కొందరు ప్రయత్నించారు. అలా ప్రయత్నించగా.. ధోనీ సన్యాసి గెటప్ వెనకున్న అసలు రహస్యం బయటకొచ్చింది. ఇంతకీ ధోనీ సన్యాసి వస్త్రధారణ వెనకున్న రహస్యమేంటో తెలుసా..? అదో యాడ్ కోసం. అది కూడా ఐపీఎల్ కోసం రెడీ చేస్తున్న ఓ యాడ్ కోసం ధోనీ ఇలా రెడీ అయ్యాడు.
ఐపీఎల్ 2021 ప్రమోషన్‌లో భాగంగా రెడీ చేస్తున్న ఓ సరికొత్త యాడ్‌లో ధోనీ ఇలా బౌద్ధ సన్యాసి గెటప్‌లో ప్రత్యక్షమయ్యాడు. టోర్నీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్, టోర్నీ స్పాన్సర్ వివో, ఐపీఎల్ యాజమాన్యం ఐపీఎల్ ప్రమోషన్‌కు సంబంధించి తయారు చేసిన ప్రోమో వీడియోలో ధోనీ బౌద్ధ సన్యాసి గెటప్‌లో కనిపించాడు. ‘ఇండియాకా అప్నా మంత్రా’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో యూట్యూబ్‌లో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. ఐపీఎల్ విశిష్టతను, ఐపీఎల్ టోర్నీలో అత్యధిక విజయాలు అందుకున్న రోహిత్ శర్మ వంటి కెప్టెన్ గురించి సన్యాసి వేషంలో ఉన్న ధోనీ.. తన శిష్యులకు వివరిస్తాడు. ఇప్పడు ఈ యాడ్ ఫిల్మ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మొత్తమ్మీద తనదైన కూల్ నెస్ తో ధోనీ ఈ యాడ్ ను రక్తికట్టించాడనే చెప్పాలి.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ షురూ కానుంది. మొత్తం 52 రోజుల పాటు 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా దీనికోసం అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కలకత్తా, బెంగళూరు వేదికలుగా ఈ మ్యాచ్‌లన్నీ జరగనున్నాయి. అంతేకాకుండా ఈ ఐపీఎల్ టోర్నీకి ప్రేక్షకులను అనుమతించబోమని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. ఇక ఆటగాళ్లు కూడా బయో బబుల్ వాతావరణంలోనే టోర్నీలో పాల్గొననున్నారు. కాగా.. ఇప్పటికే ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టులో కొందరు ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు.